‘నీవు ఎక్కే రైలు జీవితకాలం లేటు’ అన్నారు ఒక కవి. మన రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి కూడా అంతే. దీనికి ఉదాహరణ నర్సాపురం - విజయవాడ సెక్షన్ ఆధునీకరణ పనులు. నర్సాపురం నుంచి విజయవాడ, భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి నిడదవోలు జంక్షన్ వరకు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు నత్తను తలపిస్తున్నాయి. పదేళ్ల క్రితం పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. కేవలం విజయవాడ- భీమవరం టౌన్ మధ్య మాత్రమే డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తి అయ్యాయి. అయితే ఇటు నర్సాపురం, అటు నిడదవోలు జంక్షన్ వరకు పనులు పూర్తికాకపోవడం వల్ల భీమవరం వరకు పనులు జరిగినా విద్యుత్ రైళ్లు నడిచే పరిస్థితి లేదు. విజయవాడ నుంచి భీమవరం మీదుగా ఇటు నర్సాపురం, అటు నిడదవోలు జంక్షన్ వరకు డబ్లింగ్ (రెండో లైను) నిర్మాణం, విద్యుదీకరణ పనులు 2011- 12 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. కోస్తా రైల్వే బెల్ట్ ఆధునీకరణలో భాగంగా ఈ పనులు జరుగుతున్నాయి. దక్షణ మధ్య రైల్వేలో ఇది కూడా మంచి ఆదాయం ఇచ్చే మార్గం. ఇక్కడ నుంచి ఆక్వా, వరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి, సిమెంట్, ఐరెన్ వంటి వస్తువుల దిగుమతి పెద్ద ఎత్తున జరుగుతుంది. అంతేకాకుండా ప్రయాణీకుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది.
అందుకే...
more... రైల్వే శాఖ ఇక్కడ నుంచి హైదరాబాద్, తిరుపతి, విశాఖ, విజయవాడకే కాకుండా ముంబై, భువనేశ్వర్, పూరీ, చెన్నై, బెంగుళూరు వంటి నగరాలను కలుపుతూ రైలు సర్వీసులను నడుపుతుంది. విశాఖ, శేషాద్రి, సర్కార్, నర్సాపూర్, కోకనాడ ఏసీ, నర్సాపూర్- తిరుపతి, పూరీ - తిరుపతి, నర్సాపూర్ - నాగర్సోల్, విశాఖ - ముంబై ఎల్టీటీ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లు తిరుగుతున్నాయి. త్వరలో కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం మీదుగా నర్సాపురం వరకు రైల్వేలైన్ పనులు పూర్తి కానున్నాయి. ఇదే జరిగితే వస్తు రవాణా పెరగడంతోపాటు ప్రయాణీకుల తాకిడి కూడా అధికమవుతుంది.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రైల్వే లైన్ ఆధునీకరణను చేపట్టారు. నర్సాపురం నుంచి భీమవరం మీదుగా విజయవాడ వరకు, నిడదవోలు జంక్షన్ నుంచి తణుకు మీదుగా భీమవరం టౌన్ వరకు తొలుత రూ.1,350 కోట్లు కేటాయించింది. పదేళ్లు కావస్తున్నా ఇంకా పనులు మాత్రం పూర్తి కాలేదు. దీనితో అంచనాలు పెరుగుతున్నాయి. 2019 నాటికి ఇది కాస్తా రూ.2,250 కోట్లకు చేరింది. అయినా పనులు ఇంకా పూర్తి కాలేదు. మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశముందని తాజా అంచనా. దీని వల్ల ఖర్చు మరింత పెరగనుంది.
Also Read : 484 ప్రాజెక్టులు... రూ.7.53 లక్షల కోట్లు విజయవాడ నుంచి భీమవరం టౌన్ వరకు 106 కిమీలు పూర్తయ్యింది. గత జనవరి 21వ తేదీన ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. భీమవరం టౌన్ నుంచి తణుకు మీదుగా నిడదవోలు జంక్షన్ వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిడదవోలు జంక్షన్ వరకు పూర్తయితే చెన్నై - కోల్కత్తా సెక్షన్లో కలుస్తుంది. అలాగే భీమవరం టౌన్ నుంచి భీమవరం జంక్షన్, వీరవాసరం, పాలకొల్లు మీదుగా నర్సాపురం వరకు పనులు జరగాల్సి ఉంది. డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. విద్యుదీకరణ పనులు మాత్రం పూర్తికావడం లేదు. అలాగే పాలకొల్లు వంటి స్టేషన్ల ఆధునీకరణ పనులు కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టాల ప్రాంతంలో ఈ రైల్వే లైన్ ఉండడంతో పలుచోట్ల కాలువల మీద వంతెనలు, చిన్నచిన్న కల్వర్టులు ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. దీని వల్ల అనుకున్న దాని కన్నా పనులు ఆలస్యమైనట్టు రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పనులు మొదలుపెట్టి పదేళ్లు అవుతున్నా పూర్తికాకపోవడంపై ప్రయాణీకుల్లో అసంతృప్తి నెలకొంది.