Article Source:
ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న నల్లపాడు-బీబీనగర్ రైల్వే ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఆరు దశల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలి ఏడాదే మూడు చోట్ల సుమారు రూ.1,871 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
...
more... రూ.1,871 కోట్లతో పనులు ప్రారంభంగుంటూరు రైల్వే, న్యూస్‌టుడే
నడికుడి-కుక్కడం మధ్య ప్రారంభమైన పనులు
ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న నల్లపాడు-బీబీనగర్ రైల్వే ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఆరు దశల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలి ఏడాదే మూడు చోట్ల సుమారు రూ.1,871 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నడికుడి - కుక్కడం మధ్య రూ.571 కోట్లతో 47 కి.మీ. పనులు ఇటీవలే ప్రారంభించారు. కుక్కడం - వెలిగొండ మధ్య రూ.700 కోట్లతో 75 కి.మీ పనులు చేసేందుకు గుత్తేదారుడ్ని ఎంపిక చేశారు. నల్లపాడు-బెల్లంకొండ మధ్య రూ.600 కోట్లతో 56 కి.మీ పనులకు టెండర్ల పనులు ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన బీబీనగర్ (పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పనులు మొదలు కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం ఆరు దశల్లో...
నల్లపాడు-బీబీనగర్ మధ్య 248 కి.మీ లైను నిర్మాణానికి రూ.2,853 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ మార్గం మొత్తం ఆరు దశల్లో పూర్తి చేయాలని కన్‌స్ట్రక్షన్ విభాగం అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. పనులు పూర్తయిన మార్గాన్ని వెంటనే వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. తొలి దశలో కుక్కడం -నడికుడి పనులు ఇప్పటికే కాంట్రాక్టరు ప్రారంభించారు. కుక్కడం - వెలిగొండ పనులను కాంట్రాక్టరుకు అప్పగించారు. నల్లపాడు-బెల్లంకొండ మధ్య పనుల కోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. రెండో రైల్వే లైను నిర్మాణానికి మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో 135 హెక్టార్లు, మిగిలింది తెలంగాణలో ఉంది. భూసేకరణ ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది.
ఈ మార్గంలో సింగిల్ లైను
సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ వరకు రెండు లైన్ల రైలు మార్గం ఉంది. ఆ తర్వాత పగిడిపల్లి స్టేషన్ నుంచి నల్గొండ-మిర్యాలగూడ.. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లపాడు వరకు ఒక లైను మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గంలో ఒక రైలు వస్తుంటే మరో బండిని స్టేషన్లో ఆపాల్సి వస్తోంది. ట్రాక్ సామర్థ్యంతో పోలిస్తే 140 శాతం రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ మార్గాన రెండో లైను నిర్మాణానికి సంబంధించిన సర్వే నివేదికను రైల్వే బోర్డు పరిశీలించి ఆమోదించింది. దీంతో 248 కి.మీ లైనుకు రూ.2,853 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర కేబినెట్ కమిటీ గత ఏడాదిలోనే ఆమోద ముద్ర వేసింది. రద్దీ మార్గంతో పాటు సికింద్రాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించే కీలకమార్గం కావడంతో పనులను ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
#APRailwayInfra #GNT #SCOR #APRailInfra