డెల్టా ప్యాసింజర్ రైలులో ప్రయాణికుల నుంచి బంగారం, నగదు దోచుకున్న అనంతరం దొంగలు చైన్ లాగి రైలు దిగి వెళ్లిపోయారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి నడికూడి- పొందుగుల రైల్వేస్టేషను మధ్య జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రేపల్లె నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న డెల్టా ప్యాసింజర్ అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో నడికూడి, పొందుగుల మధ్య వెళ్తోంది. పులిపాడు పొలాల వద్దకు వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు రైలు చైన్ లాగారు. ఎస్-2 బోగీలో నిద్రిస్తున్న ప్రయాణికులను బెదిరించి, సుమారు రూ. 60 వేల నగదు, 20 సవర్ల బంగారం దోచుకున్నట్లు ప్రయాణికులు చెబుతు న్నారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక హడావుడి పడుతున్న రైల్వే ఉద్యోగులు, భధ్రతా సిబ్బంది కన్నుగప్పి దొంగలు పొలాల్లో పడి పారి పోయారు. సొమ్మును పోగొట్టుకున్న బాధితుల కేకలతో తోటి ప్రయాణికులు, ఉద్యోగులు సంఘటన స్థలం బోగీలోకి చేరుకొన్నారు. భాధితులు సికింద్రాబాద్ రైల్వేస్టేషనులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దొంగలకు...
more... అడ్డాగా నడికూడి - పొందుగుల
నడికూడి - పొందుగుల మధ్య రైలు చైను లాగి దొంగలు సొత్తు దోచుకున్న ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. నారాయణాద్రి, శబరి రైళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. నడికూడి రైల్వే జంక్షనులో 22 మంది కానిస్టేబుల్స్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉండాలి. కానీ, కేవలం ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కోర్టు వాయిదాలు, క్రైమ్ మీటింగ్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లాలంటే... స్టేషనుకు తాళాలు వేయాల్సిందే. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.